ఇంటి భోజనం, ప్రత్యేక బెడ్.. అనంతబాబు పిటిషన్లపై 29న తీర్పు
- డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతబాబు
- అనంతబాబుకు గ్యాస్ట్రో ఎంట్రాలజీ నిపుణుడితో పరీక్షలు చేయించాలన్న కోర్టు
- అనంతబాబుకు బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును కోరిన పబ్లిక్ ప్రాసిక్యూటర్
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ప్రస్తుతం రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన దాఖలు చేసిన పలు పిటిషన్లపై విచారణ జరిపిన రాజమండ్రి ప్రత్యేక న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. జైల్లో తనకు ఇంటి భోజనంతో పాటు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలనే పిటిషన్, అలాగే సాక్షులను బెదిరించిన కేసులో బెయిల్ పిటిషన్‌పై కోర్టులో ఇరుపక్షాల లాయర్లు గట్టిగా వాదించుకున్నారు.
వెన్నుపూస, మెడ సంబంధిత తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నందున తనకు జైలు వెలుపలి నుండి ఇంటి భోజనం,స్పెషల్ మెడికల్ బెడ్ సదుపాయాలు కావాలని అనంతబాబు కోర్టును కోరారు. కోర్టు ఆదేశాల మేరకు వైద్య పరీక్షల నివేదికలను జైలు అధికారులు న్యాయమూర్తికి సమర్పించారు. అయితే, అనంతబాబుకు ఉన్న గ్యాస్ట్రిక్ సమస్యలపై ఒక ‘గ్యాస్ట్రో ఎంట్రాలజీ’ నిపుణుడితో కూడా టెస్టులు చేయించాలని కోర్టు ఆదేశించింది. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆ స్పెషలిస్ట్ లేరని అధికారులు చెప్పడంతో... పూర్తి మెడికల్ రిపోర్ట్ వచ్చాకే ఇంటి భోజనం, ప్రత్యేక సదుపాయాలపై నిర్ణయం తీసుకుంటామని జడ్జి స్పష్టం చేశారు.
ఇదే సమయంలో, సాక్షులను బెదిరించారనే కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ అనంతబాబు వేసిన మరో పిటిషన్‌పై ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. "అనంతబాబుకు పాత నేరచరిత్ర ఉంది. ఇప్పుడు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తే బయట ఉన్న సాక్షుల భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లుతుంది. అధికార బలం, అంగబలంతో కేసు విచారణకు ఆటంకం కలిగించే అవకాశం ఉంది" అని పీపీ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం... అనంతబాబు బెయిల్ పిటిషన్‌తో పాటు జైల్లో ఇంటి భోజనం, ప్రత్యేక సదుపాయాల కల్పన పిటిషన్‌పై ఈ నెల 29న ఒకేసారి తీర్పు వెలువరిస్తామని ప్రకటించింది.